: తమ్ముడి డైలాగులు కట్ చేసి నేను చాలా తప్పుచేశానేమో అనిపించేది!: పరుచూరి వెంకటేశ్వరరావు
ఏ సినిమా అయినా కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ సీన్లు మాత్రం తాను రాస్తానని, తన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ మాత్రం హీరో, విలన్ కొట్టుకునే సందర్భాలలో చెప్పే డైలాగ్ లు రాస్తాడని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను ఎక్కువగా నాటకాలు రాశానని, ఆ నాటకాలు చాలా మటుకు సినిమాలయ్యానని చెప్పారు. బందరు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎక్కువగా నాటకాలు వేసేవాడినని అన్నారు. ఇక సినిమా రచన విషయాల్లో తనకి, తమ్ముడు గోపాలకృష్ణకి మధ్య విభేదాలొస్తూ ఉంటాయన్నారు. ‘మా వాడు విచిత్రమైన డైలాగ్ లు రాస్తుంటాడు. ‘ఇవేమి డైలాగ్ లు రా?’ అనే వాడిని. ఇటువంటి డైలాగ్ లే మాస్ కు నచ్చుతాయనేవాడు. ఆ డైలాగుల్లో చాలా కట్ చేసి కొన్ని ఉంచేవాడిని. అయితే, వాడు రాసిన డైలాగులకు మంచి స్పందన వస్తుండేది. అందుకే, వాడి డైలాగ్ లు కట్ చేసి నేను చాలా తప్పుచేశానేమో అనిపించేది’ అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.