: చైనా పర్యటనలో చంద్రబాబు బిజీ బిజీ ... ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన ముఖ్యమంత్రి


ఏపీలో అపారమైన ఖనిజ సంపద, విస్తృత అవకాశాలు ఉన్నాయని, అందుకే అక్కడ పెట్టుబడులు పెట్టాలని చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కోరారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు చంద్రబాబు హాంగ్ కాంగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి టియాంజిన్ చేరుకున్న సీఎం బృందానికి ఘనస్వాగతం లభించింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకానమిక్ ఫోరం) వేదికగా ఆయన దేశాధినేతలతో, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ముందుగా హంగ్జు డింగ్షెన్ ఇండస్ట్రీ గ్రూపు చైర్మన్ జోగ్జిన్హాయ్ తో సమావేశమయ్యారు. గనులు, ఖనిజ ఉత్పత్తి రంగంపై చర్చించారు. ఏపీలో ఖనిజసంపద, అవకాశాలపై ఆయనకు చంద్రబాబు వివరించారు. వ్యాపార సరళీకరణ అంశంలో భారత్ లో ఏపీ రెండో స్థానంలో, ఎఫ్ఢీఐల ఆకర్షణలో మూడోస్థానంలో ఉన్నట్లు వివరించారు. అనంతరం, శ్రీలంక మంత్రి సమర విక్రమతో బాబు సమావేశమయ్యారు. శ్రీలంక ప్రధాని పంపిన శుభాకాంక్షల సందేశాన్ని ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన అందజేశారు. పర్యాటక రంగంలో ఏపీతో కలిసి పనిచేయాలన్న శ్రీలంక ప్రధాని ఆకాంక్షను ఆయన చంద్రబాబుకు తెలిపారు. శ్రీలంకలో పర్యటించాలని చంద్రబాబును సమర విక్రమ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమర విక్రమతో చంద్రబాబు మాట్లాడుతూ, పోర్టు ఆధారిత అభివృద్ధిపై తాము దృష్టి పెట్టామని అన్నారు. ఆ తర్వాత కువైట్ డానిష్ డెయిరీ కంపెనీ చైర్మన్ మహ్మద్ జాఫర్, లిబ్రా గ్రూప్, మిత్సు బుషి, హ్యులెట్ ప్యాకర్డ్, ఓజిన్ తదితర సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కాగా, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కువైట్ డానిష్ సంస్థ ఆసక్తి కనపరిచింది.

  • Loading...

More Telugu News