: టీడీపీ పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు: త్రిపుర సీఎం మాణిక్ సర్కార్
ఏపీలో టీడీపీ పరిపాలన కారణంగా ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. విజయవాడలోని జీఆర్టీఎస్ రోడ్డులో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 14వ మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్ సర్కార్ మాట్లాడుతూ, ఏపీ, కేంద్ర ప్రభుత్వాలపై ఆయన మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెరిగినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని, రక్షణ రంగంలో ఎఫ్డీఐలు దేశానికి మంచిది కాదని, విద్య, వైద్య, బీమా రంగాలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, కార్మిక రంగం పైనా ప్రభుత్వం దాడులు చేస్తోందని, ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని మాణిక్ సర్కార్ అన్నారు.