: ప్రతిపక్షాలు ఏ పూటకామాట మాట్లాడుతున్నాయి!: తెలంగాణ మంత్రి హరీష్ రావు
ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు ఏ పూటకామాట మాట్లాడుతున్నాయని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూడటం దారుణమని ఆయన మండిపడ్డారు. పూటకోమాట, జిల్లాకోమాట మాట్లాడుతున్న ప్రతిపక్షాల తీరు చాలా దారుణంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం, రైతుల నోటిదగ్గర కూడు లాక్కునేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ‘తెలంగాణను ముంచే పులిచింతల ప్రాజెక్టు నిర్మించడం కాంగ్రెస్ కు ఒప్పయింది.. తెలంగాణను సస్యశ్యామలం చేసే మల్లన్న ప్రాజెక్టు తప్పయిందా? నలభై తొమ్మిది వేల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చేది తోటపల్లి ప్రాజెక్టు. అక్కడ ఉండే వాగులమీద రెండు అక్విడెక్టులు కడితే మూడు గ్రామాలు మునగకుండానే..నలభై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం ఆరోజు నిర్ణయించింది. అయితే, ఆ మూడు ఊళ్లను కూడా ముంచాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు, మా పొన్నం ప్రభాకర్ గారు, మా శ్రీధర్ బాబు గారు ధర్నా చేశారు. ఆ మూడు ఊళ్లను ముంచాల్సిందేనని రాస్తారోకో, నిరాహారదీక్ష చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది’ అని హరీష్ రావు మండిపడ్డారు.