: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?... అయితే 'గాడ్ లెస్'తో తస్మాత్ జాగ్రత్త!
మీరు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాయంతో పనిచేస్తున్న స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీ ఫోన్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. 'గాడ్ లెస్' అనే ప్రమాదకరమైన మాల్ వేర్ పడగవిప్పుకుని ఉంది. ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో ఫోన్ లోకి వచ్చి చేరే ఈ వైరస్, ఇండియాలోని 46.19 శాతం ఫోన్లపై ప్రభావం చూపిస్తోందని జపాన్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ ట్రెండ్ మైక్రో వెల్లడించింది. ఈ వైరస్ వచ్చిన తరువాత వాడకందారు ప్రమేయం లేకుండా యాప్స్ డౌన్ లోడ్ అయిపోతాయని, ఆపై ఫోన్ పూర్తిగా హ్యాకర్ల చేతుల్లోకి వెళుతుందని, ఇప్పటివరకూ 8.5 లక్షల స్మార్ట్ ఫోన్లలోకి ఈ వైరస్ చేరిందని ట్రెండ్ మైక్రో పరిశోధకులు తెలిపారు. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వర్షన్ కన్నా ముందున్న వర్షన్లపై ఈ వైరస్ దాడి చేస్తోందని, ఇండియా తరువాత ఇండొనేషియా, థాయ్ ల్యాండ్లపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. దీని బారి నుంచి ఫోన్ ను కాపాడుకోవాలంటే, యాప్స్ అన్నీ గూగుల్ ప్లే స్టోర్ లో రివ్యూలను పరిశీలించిన తరువాత మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని, వాటి అప్ డేట్స్ కూడా అక్కడి నుంచే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. వీలైతే 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ కు మారిపోవాలని, యాంటీవైరస్ ఉండాలని సూచిస్తున్నారు.