: ఎమర్జెన్సీ పెట్టాలని చూసిన సోనియా... సైన్యం సహకరించ లేదన్న సుబ్రహ్మణ్య స్వామి
2011-12 ప్రాంతంలో సోనియా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించాలని చూశారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరో సంచలన ఆరోపణ చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 41 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోనియా ప్రయత్నాలను సైన్యం అడ్డుకుందని తెలిపారు. అప్పటి ఆర్మీ జనరల్ వీకే సింగ్, తాము సహకరించబోమని స్పష్టం చేయడంతోనే సోనియా వెనకడుగు వేశారని స్వామి తెలిపారు. హిందుత్వ టెర్రర్ గ్రూపులను సాకుగా చూపుతూ, సోనియా అత్యయిక స్థితిని ప్రకటించాలని భావించారని తెలిపారు. అయోధ్య అంశంపైనా మాట్లాడిన స్వామి, మొఘల్ పాలనలో వేలాది హిందూ దేవాలయాలు సర్వ నాశనమైనాయని, అయోధ్య, కాశీ, మధురల్లో గుడులు నిర్మించుకునేందుకు ముస్లింలు సహకరించాలని కోరారు. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించుకునేందుకు సరయూ నది ఒడ్డున భూమిని ఇస్తామని తెలిపారు. ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో విచారణ జరిపితే, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జైలుకు పోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఊచలు లెక్కించాల్సిందేనని అన్నారు.