: భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి: రేవంత్ రెడ్డి


మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంతో భూ నిర్వాసితులుగా మారిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్‌ జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో దీక్షకు దిగిన టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులను ఆదుకునేందుకు లాఠీ దెబ్బ‌ల‌ను, తూటాల‌ను ఎదుర్కునేందుకు సిద్ధ‌మ‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ తాను కూడా ఓ రైతునే అని మాట్లాడుతున్నార‌ని, సాటి రైతును ఆదుకోని వ్య‌క్తి రైతు ఎలా అవుతార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ ప్ర‌జా సంక్షేమం అంటూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని, ప్ర‌చార ఆర్భాటాలు వ‌దిలి భూనిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారాన్ని ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాంతంలో రైతుల‌ను బెదిరింపుల‌కు గురిచేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు స‌రియైన ప‌రిహారం చెల్లిచాల‌ని డిమాండ్ చేశారు. రెండు వారాల్లో వారికి న్యాయం చేయ‌క‌పోతే కేసీఆర్ ఫాంహౌస్ ను ముట్ట‌డించి ఆందోళ‌న తెలుపుతామ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News