: న్యాయాధికారుల విభజన సరిగా లేదు: ఎంపీ వినోద్
బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ ఈరోజు తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయాధికారుల విభజన సరిగా లేదని న్యాయవాదులు పేర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై జోక్యం చేసుకోవాలని, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. న్యాయాధికారుల విభజన జాబితాను వెనక్కి తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడి అధికారులు అక్కడే పనిచేయాలని విభజన చట్టంలో ఉందని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కమిటీ వేయకుండానే విభజన జరగడం సరికాదని అన్నారు. విభజన చట్టం సెక్షన్ 80 ప్రకారం న్యాయాధికారుల విభజనకు కమిటీ ఏర్పాటు చేయాలని అందులో ఉందని ఆయన చెప్పారు.