: నవ్యాంధ్రకు భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయింపు
నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ఈరోజు శ్రీకారం చుట్టారు. తుళ్లూరులో నేలపాడు రైతులకు లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయించారు. మొత్తం 847 మంది రైతులకు లాటరీ పద్ధతిలో 1,916 స్థలాలు కేటాయించారు. తొలి ప్లాట్ ని నేలపాడువాసి కొమ్మినేని ఆదిలక్ష్మికి సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, నేలపాడు గ్రామస్థులకు స్థలాలు కేటాయించడం మొదటి ఘట్టమని అన్నారు. తనపై నమ్మకంతో రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు చిన రాజప్ప, నారాయణ, రావెల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.