: కోచ్ ఇంటర్వ్యూలకు డుమ్మా కొట్టిన గంగూలీ!... రోజుకో విషయాన్ని వెల్లడిస్తున్న రవిశాస్త్రి!
టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఆశించి భంగపడ్డ జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. జట్టు హెడ్ కోచ్ కోసం జరిగిన ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేసిన రవిశాస్త్రి నిన్న మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. హెడ్ కోచ్ పదవి కోసం మొత్తం 57 దరఖాస్తులు అందగా, వాటిలో నుంచి 21 దరఖాస్తులతో ఓ జాబితాను రూపొందించిన బీసీసీఐ... అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ల నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని కోరింది. ఈ నెల కోల్ కతాలో జరిగిన ఇంటర్వ్యూలకు రవిశాస్త్రి సహా పలువురు హాజరయ్యారు. అయితే ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ లేడని నిన్న రవిశాస్త్రి వెల్లడించారు. ఇంటర్వ్యూ సయయంలో సచిన్, లక్ష్మణ్, కమిటీ చీఫ్ అడ్వైజర్ గా ఉన్న సంజయ్ జగ్దాలేల నుంచి మంచి ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పిన శాస్త్రి... ఇంటర్వ్యూలో తనకు గంగూలీ కనిపించలేదని చెప్పారు. అయితే గంగూలీ గైర్హాజరీని తానేమీ ప్రశ్నించలేదని, సీఏసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన మేరకు సమాధానాలిచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.