: రాక్ స్టార్ అవతారంలో కోహ్లీ!... ఏఆర్ రెహ్మాన్ స్టూడియోలో గళం విప్పిన విరాట్!


విరాట్ కోహ్లీ ఏంటి... రాక్ స్టార్ గా మారడమేంటనేగా మీ సందేహం! క్రికెట్ లో సత్తా చాటుతున్న టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్... క్రికెట్ కు గుడ్ బై చెప్పాడన్న భయమేమీ లేదులెండి. ఏదో కొద్దిసేపు మాత్రమే అతడు అలా రాక్ స్టార్ లా మారిపోయాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ కోరిక మేరకే విరాట్ కాసేపు రాక్ స్టార్ లా సందడి చేశాడు. రెహ్మాన్ ఆహ్వానం మేరకు ఆయన స్టూడియోకు వెళ్లిన కోహ్లీ... త్వరలో తెరపైకి రానున్న ‘ప్రీమియర్ ఫుట్ సల్ లీగ్’కు తన గాత్రం అరువిచ్చాడట. ఐపీఎల్ మాదిరిగానే ‘ప్రీమియర్ ఫుట్ సల్ లీగ్’ పేరిట ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాలతో కూడిన దేశీయ ఫుట్ బాల్ సిరీస్ కు జూలై 15న అంకురార్పణ జరగనుంది. ఈ సిరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కోహ్లీ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సదరు సిరీస్ కు సంబంధించి ఓ గీతాన్ని రూపొందించే బాధ్యతలను రెహ్మాన్ తన భుజస్కందాలపై వేసుకున్నాడు. ఈ గీతంలో కోహ్లీ గొంతు కూడా వినిపించాల్సిందేనని భావించిన రెహ్మాన్... విరాట్ ను తన స్టూడియోకు ఆహ్వానించాడు. రెహ్మాన్ ఆహ్వానం మేరకు ఇటీవలే స్టూడియోకు వచ్చిన కోహ్లీ... రాక్ స్టార్ లా మైకు ముందు నిలబడి గాత్రం అందుకున్నాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Loading...

More Telugu News