: చంద్రబాబు ఇఫ్తార్ విందులో వైసీపీ ఎమ్మెల్యే!... టీడీపీ ఎమ్మెల్యేల పక్కనే ఆసీనులైన ముస్తఫా!


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ విపక్ష వైసీపీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వైసీపీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 20 మంది టీడీపీలో చేరిపోయారు. తాజాగా నిన్న గుంటూరులో కనిపించిన ఓ దృశ్యం వైసీపీ శిబిరంలో మరోమారు కలకలం రేపింది. వివరాల్లోకెళితే... ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం నిన్న గుంటూరులో ఇప్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా హాజరయ్యారు. ఇక గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరిన మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, చాంద్ బాషా కూడా ఈ విందుకు వచ్చారు. అయితే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన మహమ్మద్ ముస్తఫా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ... వేదికపై సీఎం, టీడీపీ ఎమ్మెల్యేల పక్కన ఆసీనులయ్యారు. అంతేకాక కార్యక్రమంలో భాగంగా సందేశమిచ్చేందుకు ఆయనకు చంద్రబాబు అవకాశం కూడా ఇచ్చారు. టీడీపీ నేతలు పాలుపంచుకున్న ఈ కార్యక్రమంలో ముస్తఫా కనిపించడం వైసీపీ శిబిరంలో కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News