: ‘వాన్ పిక్’పై ఆదానీల కన్ను!... ఏపీ కేబినెట్ లో ఆసక్తికర చర్చ!


దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెరపైకి వచ్చి ఆ తర్వాత పెను వివాదానికి తెర తీసిన వాన్ పిక్ ఓడరేవు మరోమారు వార్తల్లోకెక్కింది. వాన్ పిక్ ప్రాజెక్టు కోసం వైఎస్ సర్కారు పెద్ద ఎత్తున భూములను సేకరించిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ కారిడార్ కుదింపు, తక్కువ ధరకు రైతుల నుంచి భూముల కొనుగోలు తదితర అంశాలతో ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. వైఎస్ అకాల మరణంతో ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు కేటాయించిన భూములను చంద్రబాబు సర్కారు వాపస్ తీసుకుంది. తాజాగా నిన్న విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ జరిగింది. గుజరాత్ కేంద్రంగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన గౌతం ఆదానీ ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఆదానీ గ్రూప్ ప్రతినిధులు ఈ విషయంపై ఏపీ మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ను సంప్రదించారట. ఈ మేరకు నిన్న కేబినెట్ భేటీకి హాజరైన జైన్ ఈ విషయాన్ని మంత్రివర్గం ముందు పెట్టారు. వాన్ పిక్ ఓడరేవును తాము చేపడతామంటూ ఆదానీ గ్రూప్ ప్రతినిధులు తనను సంప్రదించారని జైన్ చెప్పారు. దీంతో స్పందించిన చంద్రబాబు ఆదానీ గ్రూప్ ప్రతినిధులు తననూ కలిశారని చెప్పారు. ‘‘ఆదానీ గ్రూప్ ప్రతినిధులు నన్ను కూడా కలిసి వాన్ పిక్ పై తమకు ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. ఆ పోర్టు వ్యవహారాలను చూస్తున్న వారిని కలిసి మాట్లాడుకోవాలని వారికి సూచించాను. తర్వాత ఏమైందో నాకూ తెలియదు. వారికి ఆసక్తి ఉంటే ఇరు పక్షాల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి’’ అని చంద్రబాబు అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News