: చంద్రబాబు సర్కారు లేఖలను పట్టించుకోవద్దు!... టెన్త్ షెడ్యూల్ సంస్థల చీఫ్ లకు టీ సర్కారు ఆదేశం!
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు మరింత మేర ముదురుతున్నాయి. ఇప్పటికే కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల విషయంపై ఇరు రాష్ట్రాలు పరస్పరం మాటల దాడిని కొనసాగిస్తున్నాయి. తాజాగా విభజన చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థలకు చెందిన ఆస్తులపైనా ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. 9, 10వ షెడ్యూళ్ల కింద ఉన్న సంస్థలు ఇరు రాష్ట్రాలకు చెందినవేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కాస్తంత ఊపిరి పీల్చుకున్న ఏపీ సర్కారు ఆ సంస్థల్లోని తన వాటాని చేజిక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఆ సంస్థల్లోని నిధులు, ఇతర వివరాలు కోరుతూ తెలంగాణ సర్కారు, ఆయా సంస్థల అధిపతులకు లేఖలు రాసింది. ఈ లేఖలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను కూడా చంద్రబాబు సర్కారు జత చేసింది. అయితే ఈ లేఖలను తెలంగాణ సర్కారు తప్పుబడుతోంది. అంతేకాక ఆ లేఖలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పదో షెడ్యూల్ సంస్థల అధిపతులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిన్న కేసీఆర్ సర్కారు ఆయా సంస్థలకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.