: బ్రెగ్జిట్ ఫలితాల ఎఫెక్ట్!... 3 నెలల్లో పదవి దిగుతానన్న బ్రిటన్ ప్రధాని!
ప్రవంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బ్రెగ్జిట్ ఫలితాలు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ను పదవి నుంచి దించేలా చేశాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న విషయంపై బ్రిటన్ ప్రజలంతా నిన్న బారులు తీరి మరీ ఓటేశారు. నేటి ఉదయం వెలువడ్డ ఫలితాల్లో ప్రధాని డేవిడ్ కామెరాన్ అభిప్రాయానికి భిన్నంగా ప్రజలు ఓటేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకే ఆ దేశ ప్రజలు సుముఖత చూపారు. దీంతో ఫలితాలు వెలువడ్డ వెంటనే కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన ప్రకటన చేశారు. మూడు నెలల తర్వాత (ఈ ఏడాది అక్టోబర్)లో ప్రధాని పదవి నుంచి దిగిపోతున్నట్లు ఆయన ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ ను కొనసాగించేందుకు తన శాయశక్తులా యత్నించానని చెప్పిన ఆయన... అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశాన్ని నడిపించే బాధ్యతలకు స్వస్తి చెప్పేందుకే నిర్ణయించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేక ఫలితాలు సాధించిన తనకు అధికారంలో కొనసాగే అర్హత లేదని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.