: హైదరాబాద్‌లో 14వేల మంది బిక్షగాళ్లు.. సంపాదనలో అధిక భాగం తాగుడుకే ఖర్చు
హైదరాబాద్ నగరంలో 14వేల మంది బిక్షగాళ్లు ప్రతీరోజు కూడళ్ల వద్ద, బస్టాండ్, ప్రార్థనా మందిరాల వద్ద అడుక్కుంటూ కనిపిస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. బిక్షగాళ్ల ముసుగులో నగరవాసులని ఇబ్బంది పెడుతోన్న ముఠాలను అరికట్టే క్రమంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్‌లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఓ సమావేశం ఏర్పరచింది. నగరంలోని బిక్షగాళ్లలో వంద మంది మాత్రమే నిజమైన బిక్షగాళ్లని ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయపడ్డాయి. వీల్ చైర్ బిక్షగాళ్లలో బీహార్ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ అని పేర్కొన్నాయి. ఒక్కో బిక్షగాడు రోజుకి వెయ్యి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని, వాటిల్లో ఎక్కువ భాగాన్ని మద్యానికి, గుట్కాలకే ఖర్చు పెడుతున్నారని తెలిపారు. బిక్షగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలో బిక్షగాళ్లు లేకుండా చేస్తామని ఆయన తెలిపారు. బిక్షగాళ్ల ముసుగులో వ్యక్తులు అసాంఘిక చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. నిజమైన బిక్షగాళ్లను ఆదుకోవడానికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఉందని ఆయన తెలిపారు.