: మాపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోంది: రేవంత్ రెడ్డి
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేపటినుంచి తాను ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 48గంటల దీక్షకు దిగనున్నట్లు పేర్కొన్నారు. ముంపు గ్రామాల ప్రజలు నష్టపోకుండా ప్రభుత్వం దిగొచ్చే వరకు వారి తరఫున పోరాడతానని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామంటూ తమపై అధికార టీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చేస్తోన్న ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాలకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ 14 గ్రామాలు ఉన్నాయని, భూములు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఎకరాకు రూ. 5.80లక్షలు అందిస్తామని ప్రభుత్వం జీవో కూడా తెచ్చిందని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో అసంఘటిత కార్మికులకు రక్షణ లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.