: స్వతంత్రం కావాల్సిందే... ఎలుగెత్తి చాటిన బ్రిటన్ వాసులు!
వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాలను తన గుప్పిట్లో ఉంచుకుని పాలించిన బ్రిటన్, ఇప్పుడు స్వాతంత్ర్యం కోరుకుంటోంది. స్వేచ్ఛా వాణిజ్యం నుంచి యూరప్ లో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న దేశాల భారం తమపై పడకుండా స్వంతంత్రాన్ని కోరుతోంది. ఐరోపా దేశాల కూటమిలో ఉండటం వల్ల తమకు నష్టమే అధికమని భావిస్తున్న బ్రిటన్ వాసులు, కూటమి నుంచి వైదొలగాలని తీర్పిస్తున్నారు. విడిపోవాలని 52 శాతం మంది, కలిసుండాలని 48 శాతం మంది ప్రజలు తీర్పిచ్చినట్టు బీబీసీ వార్తా సంస్థ ప్రకటించింది. ఐటీవీ సైతం అదే విషయాన్ని స్పష్టం చేసింది. విడిపోవాలన్న వాదనకు మెరుగైన మద్దతు లభించిందని వెల్లడించింది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో బ్రెగ్జిట్ కు అనుకూలంగా 1,20,83,633 మంది, వ్యతిరేకంగా 1,12,88,706 మంది ఓట్లు వేసినట్టు ది గార్డియన్ పేర్కొంది. సెంట్రల్ లండన్ ప్రాంత ఓటర్లు కొనసాగేందుకు, ఇతర ప్రాంతాల వారు వైదొలగేందుకు అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.