: కేరళ ‘బిగ్గెస్ట్ టెర్రర్’పై సీఎంకు లేఖ రాసిన మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్
పర్యాటకుల స్వర్గధామంగా పేరున్న కేరళలో అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నది ఏది..? అందరి సంగతి ఏమో కానీ మలయాళ హీరో మోహన్‌లాల్‌ను మాత్రం చెత్త సమస్య తీవ్రంగా భయపెడుతోందట. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లారు. చెత్తను ‘బిగ్గెస్ట్ టెర్రర్’గా అభివర్ణించిన 56 ఏళ్ల ఈ హీరో చెత్త సమస్యపై దృష్టి సారించాలని సీఎంను కోరారు. చెత్త సేకరణ, రోడ్డు ప్రమాదాలు, మహిళల రక్షణపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘కేరళను అత్యంత భయపెడుతున్నదేది? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. చెత్తే అని చెబుతా. పౌరులు చాలామంది తమ ఇంట్లోని చెత్తను రోడ్డుపై పడేస్తున్నారు. అది ఎక్కడ వేయాలో తెలియకపోవడమే ఇందుకు కారణం’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే యుద్ధాల్లో కంటే ప్రజలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తున్నారని, ఈ విషయంలో నిబంధనలు మరింత కఠినతరం చేసి నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. మోహన్‌లాల్ లేఖఫై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మూడు అంశాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజలు సైతం ఈ స్టార్‌కు మద్దతు తెలుపుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో మోహన్‌లాల్ 300కు పైగా చిత్రాల్లో నటించారు. పలు ఇతర భాషల్లోనూ తన సత్తా చాటారు. నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.