: అమరావతి వెళ్లే మహిళా ఉద్యోగులకు బంపర్ ఆఫర్!... 6 నెలల పాటు ఉచిత హాస్టల్ సౌకర్యం!


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచే పాలనను కొనసాగించే వీలున్నా... అంతదాకా ఆగొద్దని ఏపీ సర్కారు తీర్మానించింది. అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని చేపట్టి దాదాపుగా పనులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27లోగా సచివాలయ ఉద్యోగులంతా వెలగపూడికి తరలిరావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విడతలవారీగా ఉద్యోగులు అక్కడికి తరలివెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదలైన తరలింపులో భాగంగా ఉద్యోగులు కుటుంబాలతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయంలో మహిళా ఉద్యోగులు మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారి పరిస్థితిని గమనించిన చంద్రబాబు సర్కారు వారికో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. అమరావతి తరలివెళ్లే ఉద్యోగులకు ఆరు నెలల పాటు ఉచితంగా హాస్టల్ వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు మహిళా ఉద్యోగుల హాస్టల్ కోసం స్థలాన్వేషణ చేస్తున్నారు. ఈ హాస్టల్ సౌకర్యం కావాల్సిన ఉద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News