: ఇద్దరు డిప్యూటీ సీఎంల ‘పవర్’ పీకేసిన చంద్రబాబు!... విశాఖ ఆర్డీఓ బదిలీ వివాదమే కారణం!


ఏపీ కేబినెట్ లో ఇద్దరు టీడీపీ కీలక నేతలు డిప్యూటీ సీఎంలుగా వ్యవహరిస్తున్నారు. వారిలో కర్నూలు జిల్లాకు చెందిన కేఈ ... డిప్యూటీ సీఎం హోదాలో రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప... మరో డిప్యూటీ సీఎం హోదాలో హోం శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న బదిలీల్లో భాగంగా వీరిద్దరి శాఖల పరిధిలోకి వచ్చే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు (ఆర్డీఓ), డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) బదిలీల్లో వారు వేలు పెట్టేందుకు అవకాశం లేకుండా సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు కేటగిరీ పోస్టుల బదిలీలను ఇద్దరు డిప్యూటీ సీఎంల నుంచి తప్పిస్తూ... తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. ఈ పోస్టుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, రాజకీయ జోక్యానికి చెల్లు చీటి ఇచ్చేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతేడాది విశాఖ ఆర్డీఓ బదిలీ వ్యవహారం ముగ్గురు మంత్రుల మధ్య పెద్ద చిచ్చునే రేపింది. విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమదైన రీతిలో చక్రం తిప్పేందుకు యత్నించారు. ఈ వివాదం నాడు పెను కలకలమే రేపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఈ పోస్టుల వ్యవహారంలో మరోమారు వివాదం చోటుచేసుకోకుండా ఉండేందుకే చంద్రబాబు తాజా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న మరుక్షణమే రంగంలోకి దిగిన చంద్రబాబు ఆర్డీఓ, డీఎస్పీల బదిలీలను ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 15 మంది ఆర్డీఓలను, 22 మంది డీఎస్పీలను బదిలీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News