: కూకట్ పల్లి కోర్టులో వైఎస్ జగన్ మామ లొంగుబాటు!... బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. హైదరాబాదులో ఓ భూ వివాదంలో చిక్కుకున్న ఆయనపై అరెస్ట్ వారెంట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. మాదాపూర్ పరిధిలోని ఓ భూమిపై కన్నేసిన రవీంద్రనాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి నకిలీ పత్రాలు రూపొందించి దానిని సొంతం చేసుకునేందుకు యత్నించారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రవీంద్రనాథ్ రెడ్డి... ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. అయితే కింది కోర్టుకే వెళ్లమంటూ హైకోర్టు చెప్పడంతో నిన్న ఆయన తన లాయర్లను వెంటబెట్టుకుని కూకట్ పల్లి 25వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.