: అమరావతి భూములకు ఎకరాకి రూ.4 కోట్ల ఆఫర్ పై చర్చే కీలకం!... మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఎకరా భూమికి రూ.4 కోట్ల మేర ఇస్తామంటూ సింగపూర్ కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీలు అసెండాస్, సెంబ్ కార్ప్ లు ప్రతిపాదించాయి. రాజధాని నిర్మాణం కాంట్రాక్టును దక్కించుకునే క్రమంలో టెండర్ ప్రకటనకు ముందే ఆ రెండు కంపెనీలు ఓ కన్సార్టియంగా ఏర్పడి ఈ ప్రతిపాదన చేశాయి. దీనిపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ నేడు విజయవాడలో కీలక భేటీ నిర్వహించనుంది. సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం నేటి ఉదయం 10 గంటలకు మొదలుకానుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోనున్న ఈ భేటీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.