: 'బ్రెగ్జిట్' పట్టని భారత మార్కెట్...!


ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చన్న అత్యంత కీలకమైన రిఫరెండం బ్రిటన్ లో జరుగుతున్న వేళ, దానికి వ్యతిరేకంగానే ప్రజలు ఓట్లు వేస్తున్నారని తెలియడంతో స్టాక్ మార్కెట్ దూసుకెళ్లింది. సెషన్ ఆరంభంలో అటు కొనుగోళ్లు, ఇటు అమ్మకాలు లేకపోగా, మధ్యాహ్నం 12:30 వరకూ క్రితం ముగింపునకు అటూ ఇటుగా సాగుతూ వచ్చిన సూచికలు ఆపై లాభాల్లో దూసుకెళ్లాయి. ముఖ్యంగా యూరప్ మార్కెట్ల లాభాలను చూసిన తరువాత కొత్త ఈక్విటీల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ప్రయత్నించారు. దీంతో ఒకదశలో నాలుగు నిమిషాల వ్యవధిలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పెరిగింది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 236.57 పాయింట్లు పెరిగి 0.88 శాతం లాభంతో 27,002.22 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 66.75 పాయింట్లు పెరిగి 0.81 శాతం లాభంతో 8,270.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.27 శాతం లాభపడగా, స్మాల్ కాప్ 0.04 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 37 కంపెనీలు లాభపడ్డాయి. టాటా మోటార్స్, యస్ బ్యాంక్, అంబుజా సిమెంట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఇన్ ఫ్రాటెల్, ఎన్టీపీసీ, సిప్లా, టాటా పవర్, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,775 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,102 కంపెనీలు లాభాలను, 1,491 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,01,38,218 కోట్లకు చేరుకుంది.

  • Loading...

More Telugu News