: ఆ దేశ ప్రధాని సరదాపడి బైక్ నడిపితే, ట్రాఫిక్ పోలీసు ఫైన్ విధించాడు
కంబోడియా ప్రధాని హన్ సేన్ ముచ్చటపడి మోటార్ బైక్ టాక్సీ నడిపితే, ట్రాఫిక్ పోలీసు ఫైన్ వేశాడు. ఎందుకంటే, ఆయన బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించకపోవడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. కాగా, ఈ నెల 18వ తేదీన కో కాంగ్ ప్రావిన్స్ లో హన్ సేన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఉన్న మోటార్ బైక్ టాక్సీని చూసిన ఆయన ముచ్చటపడటం జరిగింది. వెంటనే దానిపై కూర్చుని కొద్ది దూరం ప్రయాణించారు. అయితే, అక్కడి ట్రాఫిక్ పోలీసు ఇదంతా గమనిస్తున్నాడు. హెల్మెట్ లేకుండా వాహనం నడపటం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ప్రధానికి జరిమానా విధించడం జరిగింది. కాగా, ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్న హన్ సేన్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తనకు విధించిన జరిమానా కడతానని పేర్కొన్నారు.