: మరోమారు ‘గడపగడపకు వైసీపీ’... చంద్రబాబు అక్రమాలపై ప్రచారానికేనన్న భూమన
గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో విపక్షం వైసీపీ ‘గడపగడపకు వైసీపీ’ పేరిట పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ కార్యక్రమాలతో పాటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన కార్యక్రమాలు, నాటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాలన తీరు, టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ ప్రత్యేక కరపత్రాలు విడుదల చేసిన ఆ పార్టీ భారీ కసరత్తే చేసింది. అయితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందక ఆ పార్టీ విపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. తాజాగా మరోమారు ఆ పార్టీ ‘గడపగడపకు వైసీపీ’ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే మరోమారు ‘గడపగడపకు వైసీపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంపై పోలీసులు వ్యవహరించిన తీరే చంద్రబాబు సర్కారు అరాచక పాలనకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ‘గడపగడపకు వైసీపీ’ షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.