: ఇక ఎర్రచందనానికీ... ఓ కార్పొరేషన్!: చంద్రబాబు ప్రకటన
తిరుమల వెంకన్న కొలువై ఉన్న శేషాచలం కొండలు అత్యంత విలువైన ఎర్రచందనం మొక్కలకు ఆలవాలంగా వున్నాయి. అయితే అక్రమార్కుల దుశ్చర్యల కారణంగా అరణ్యంలోని ఎర్రచందనం మొక్కల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అయితే అధికారంలోకి రాగానే ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి సారించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వేలాది టన్నుల కొద్దీ ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఈ దుంగలను అంతర్జాతీయ స్థాయిలో వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు జవసత్వాలు నింపాలన్న చంద్రబాబు సర్కారు యత్నాలు ఫలించడం లేదు. తొలి విడతలో వేలం వేసిన దుంగలకు సంబంధించిన పూర్తి స్థాయి డబ్బు ఇంకా వేలందారుల నుంచి వసూలు కాలేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే మేలు రకానికి చెందిన ఎర్రచందనాన్ని అధిక ధరలకు విక్రయించేందుకు.. ఓ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. విజయవాడలో అటవీ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఎర్రచందనానికి అధిక ధర రాబట్టడమే ఈ కార్పొరేషన్ లక్ష్యంగా నిర్దేశించనున్నామని ఆయన పేర్కొన్నారు.