: మా వాటా వదులుకోం... ఏపీ వాటాలో చుక్క నీటినీ తీసుకోం: కుండబద్దలు కొట్టిన హరీశ్
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. అదే సమయంలో ఏపీ వాటాలో తమకు ఒక్క నీటి బొట్టు కూడా అవసరం లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. కృష్ణా నదీ జలాల పంపిణీపై నెలకొన్న వివాదం పరిష్కారం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన హరీశ్ రావు... అప్పటికే అక్కడికి చేరుకున్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో భేటీ అయ్యారు. రెండు విడతలుగా జరిగిన ఈ భేటీ ఏమంత సత్ఫలితాలివ్వలేదు. బచావత్ ట్రైబ్యూనల్ మేరకే తాము నడుచుకుంటామని భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన చెప్పారు. అంతేకాకుండా కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి అన్ని ప్రాజెక్టులను చేర్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా బోర్డు పరిధి నుంచి మినహాయించినా ఒప్పుకునేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అంతేకాకుండా మొత్తం నదీ జలాల పంపిణీ బాధ్యతను కూడా బోర్డుకే వదిలేయాలన్నా తమకు సమ్మతమేనని ఆయన చెప్పారు. ఈ క్రమంలో తమ వాటాలో చుక్క నీటిని వదులుకునేది లేదని తేల్చిచెప్పిన హరీశ్... ఏపీ వాటాలోని సింగిల్ నీటి బొట్టు కూడా తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు.