: టీమిండియా కోచ్ ఎవరో తేలేది నేడే!... కుంబ్లేకే అవకాశాలు ఎక్కువట!


క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా కోచ్ ఎవరన్న విషయం నేటి సాయంత్రంలోగా తేలిపోనుంది. ఈ మేరకు నేటి ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా బీసీసీఐ చైర్మన్, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. నేటి సాయంత్రానికి ముందుగానే టీమిండియా కోచ్ ఎవరన్న విషయం తేలిపోతుందని ఆయన పేర్కొన్నారు. కోచ్ పదవి కోసం అందిన దరఖాస్తుల్లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలను జత చేస్తూ ఓ నివేదికను కమిటీ బీసీసీఐకి అందజేసింది. ఈ నివేదికపై ధర్మశాలలో నేడు భేటీ కానున్న బీసీసీఐ... కోచ్ పేరును ప్రకటించనుంది. ఇదిలా ఉంటే... నిన్నటిదాకా కోచ్ పదవి రేసులో టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ముందు వరుసలో ఉన్నారు. అయితే అనూహ్యంగా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఆయనను వెనక్కు తోసేశారు. త్రిసభ్య కమిటీ ముందు ఇంటర్వ్యూ సందర్భంగా కుంబ్లే ఇచ్చిన ప్రజెంటేషనే ఆయనను రవిశాస్త్రి కంటే కాస్తంత ముందు వరుసలో నిలబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News