: పెళ్లి ఫోటోలు దిగుతున్న వేళ పెళ్లికొడుకుకి పాము కాటు...!
మనసుకు నచ్చి పెళ్లాడిన భార్యతో కలసి పెళ్లి ఫోటోలు దిగుతున్న వేళ, యువకుడు పాముకాటుకు గురైన ఘటన ఇది. ఆపై ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, మరిన్ని వివరాల్లోకి వెళ్లాల్సిందే. జానీ, లౌరా బెన్సన్... అమెరికాలోని ఫోర్ట్ కొలిన్స్ లో నెలల తరబడి ప్రణాళికలు వేసుకుని వైభవంగా పెళ్లి చేసుకున్న నవ దంపతులు. రిసెప్షన్ ను సైతం గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. మరికాసేపట్లో రిసెప్షన్ ఉందనగా, అక్కడికి సమీపంలోని హార్స్ టూత్ రిజర్వాయర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెళ్లి ఫోటోలకు పోజులు ఇద్దామని వెళ్లారు. నవ్వుతూ, ఒకరిని ఒకరు ముద్దాడుతున్న సమయంలో ఓ పాము జానీని కాటేసింది. "నా మడమపై ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. అది ఏదైనా పాము కాటా? కాదా? అన్నది తెలియదు. అనుమానంతో కిందకు చూశాను. ఓ రాటిల్ స్నేక్ కనిపించింది. నన్ను పాము కరిచిందా? అన్న అనుమానంతో విషయాన్ని లౌరాకు చెప్పాను. ఆమె ముందు కాలి మడమను పరిశీలించమని చెప్పింది. పాము కరచిన గుర్తులను చూసి తీవ్ర ఆందోళన చెందాను" అని తన కెదురైన అనుభవాన్ని జానీ పంచుకున్నాడు. అప్పటికీ, పాము కాటు ప్రభావం తన శరీరానికి తెలియలేదని, ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్న పెళ్లి రిసెప్షన్ వేడుక ఎక్కడ ఆగిపోతుందోననే ఆలోచించానని తెలిపారు. అక్కడే ఉన్న అడ్వెంచర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మాడీ మేయ్, పార్క్ రేంజర్లకు వెంటనే సమాచారాన్ని అందించారు. వాస్తవానికి రాటిల్ స్నేక్ చాలా విషపూరితం. అది కాటేస్తే అవయవాలు చచ్చు బడటం, రక్తం కారడం, శ్వాస సరిగ్గా తీసుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. యాంటీ వెనమ్ చాలా ఖరీదైనది. అందువల్ల ఆంబులెన్స్ లో అది ఉండదు. జానీలో పాము కరిచిన లక్షణాలు అతి తక్కువగా ఉండటంతో, మెడికల్ ఎమర్జెన్సీ సిబ్బంది అతన్ని ఓ రూముకు తరలించి చికిత్స చేశారు. అంతకుముందు అదే పాము మరో జంతువును కాటేసి వుండవచ్చని, అందువల్లే పెద్దగా విషం జానీ శరీరంలోకి చేరలేదని తేల్చారు. తనకు ప్రాణాపాయం లేదని తెలుసుకున్న జానీ, తన భార్యతో కలసి ఓ గంట ఆలస్యంగా రిసెప్షన్ కు వెళ్లగా, పాము కాటు నుంచి తప్పించుకున్న అతన్ని బంధుమిత్రులంతా అభినందిస్తూ, 'జానీ రాటిల్ స్నేక్' అని ఆటపట్టిస్తూ, వేడుకను మరింత సంబరంగా చేశారు. ఈ విషయాన్ని గురించి తాము తమ పిల్లలకు కథగా చెబుతామని కొత్త జంట అంటోంది.