: నేడు బ్రెగ్జిట్... ఉత్కంఠగా చూస్తున్న ప్రపంచం!


యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ ఉండాలా? వద్దా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేడు బ్రిటన్ వాసులు ఇవ్వనున్నారు. బ్రెగ్జిట్ (బ్రిటన్ ఎగ్జిట్)పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుండగా, వ్యతిరేకులకే స్వల్ప ఆధిక్యం ఉందని పోల్ సర్వేలు నిర్వహిస్తుండటంపై ప్రపంచ వ్యాపార వర్గాలు ఆందోళనగా ఉన్నాయి. ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని వుంది. ఈయూ అనుకూల వర్గాలు, వ్యతిరేక వర్గాలు గత కొన్ని నెలలుగా ముమ్మరంగా ప్రచారం చేయగా, వారం రోజుల క్రితం వరకూ అనుకూల వర్గాల పైచేయి కనిపించగా, ఇప్పుడు వ్యతిరేకంగా ఓటేసే వారి సంఖ్యే ఎక్కువన్న సమాచారం వెలువడుతోంది. దీంతో ఎక్కడ స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావం పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సైతం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సెబీతో కలసి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ఇండియాలో తగినన్ని విదేశీ మారక ద్రవ్య నిధులుండటం కలసి వచ్చే అంశమని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక భారత కార్పొరేట్ సామ్రాజ్యంలో అత్యధికంగా భయపడుతున్నది ఐటీ వర్గమే. యునైటెడ్ కింగ్ డమ్ లో వ్యాపారం నిర్వహిస్తూ, అక్కడి నుంచి మంచి ఆదాయం పొందుతున్న కంపెనీలపై బ్రెగ్జిట్ ప్రభావం స్పష్టంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2015-16లో, అతిపెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థ టీసీఎస్ యూకే నుంచి 14 శాతం ఆదాయాన్ని పొందగా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 13 శాతం ఆదాయాన్ని, టెక్ మహీంద్రా, విప్రోలు 12 శాతం ఆదాయాన్ని అందుకున్నాయి. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగితే, వీటికి లభించే ఆదాయంపై ప్రభావం వుంటుందన్న విశ్లేషణలతో గత కొద్ది రోజులుగా భారత ఐటీ కంపెనీల ఈక్విటీ విలువ పతనమౌతూ వస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగితే, తమకే అత్యధిక నష్టం వాటిల్లుతుందని పెద్దన్న అమెరికా సైతం వణికిపోతోంది. బ్రిటన్ వాసులు బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఓటేస్తే, అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వయంగా ఫెడరల్ చైర్మన్ జానెట్ యెల్లన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికాకు చెందిన ఎన్నో వాహన, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు బ్రిటన్ లో వ్యాపారం నిర్వహిస్తుండటమే ఇందుకు కారణం. వేలాది మంది అమెరికన్లు బ్రిటన్ లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండగా, కూటమి నుంచి బ్రిటన్ వైదొలగితే, ఈ కంపెనీల భవిష్యత్ పెట్టుబడులపై పెను ప్రభావమే ఉంటుంది. ఇక బ్రిటన్ పాలకులు సైతం తమ దేశం యూనియన్ లో కొనసాగితేనే మేలని భావిస్తున్నారు. ప్రధాని డేవిడ్ కామెరూన్ సైతం ప్రజలకు అదే విషయాన్ని పదేపదే విజ్ఞప్తి చేశారు. ఓటేసే ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు. యూనియన్ లో సభ్య దేశంగా బ్రిటన్ లోని వ్యాపార సంస్థలు మిగతా అన్ని దేశాల్లో స్వేచ్ఛగా వ్యాపారం నిర్వహిస్తూ ఉండగా, ఇప్పుడీ రెఫరెండం తరువాత వైదొలగాల్సి వస్తే, అన్ని కంపెనీల వ్యాపారంపైనా ప్రభావం కనిపిస్తుంది. అదే ఇప్పుడు బ్రిటన్ పాలకుల భయం. నేడు జరగనున్న బ్రెగ్జిట్ పోలింగ్ లో ఏ వర్గం నెగ్గుతుంది? ప్రజలు ఎవరివైపు నిలుస్తారు? అన్న విషయం తెలియాలంటే, మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News