: శరవేగంగా తాత్కాలిక సచివాలయ పనులు... 4 రోజుల్లో అందుబాటులోకి రెండు బ్లాకులు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో మరింత వేగం పుంజుకుంది. ఈ నెల 27 నాటికి సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జెట్ స్పీడుతో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాజాగా గడువు మరింత సమీపించడంతో పనులు మరింత వేగం పుంజుకున్నాయి. సీఎం కార్యాలయం సహా సిబ్బంది కోసం నిర్మిస్తున్న ఐదు బ్లాకుల నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. తొలి, రెండో బ్లాకుల పనులు మరో నాలుగు రోజుల్లోగా పూర్తి కానున్నాయి. ఇక మూడు, నాలుగు, ఐదు బ్లాకుల పనులు కూడా మరో వారం రోజుల్లోనే పూర్తి కానున్నట్లు సమాచారం. ఇక సచివాలయానికి అవసరమైన విద్యుత్, నీటి సరఫరా పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి.