: సల్మాన్ ఖాన్ కు షాక్!... రేప్ కామెంట్స్ పై మహిళా కమిషన్ సమన్లు జారీ!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. సినిమా షూటింగ్ లో కుస్తీ ఫీట్లు చేసినప్పుడు అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితిని అనుభవించానని సల్మాన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తప్పుగా మాట్లాడానని, తనను క్షమించాలని సల్మాన్ ఆ వెంటనే క్షమాపణలు చెప్పారు. అయినా అతడికి ఇబ్బందులు తప్పలేదు. సల్మాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర మహిళా కమిషన్ అతడికి నిన్న సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న తమ ముందు హాజరై సదరు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ సమన్లలో మహిళా కమిషన్ ఆయనను ఆదేశించింది. విచారణకు హాజరుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.