: రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని కడిగేస్తాం: కాంగ్రెస్
రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ ఆ విషయాన్ని ఇక్కడితో వదిలేది లేదని, పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. నిబంధనలు సవరించి మరీ రక్షణ రంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దారులు తెరవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి అమెరికా ఒత్తిడి మేరకు పనిచేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో కొన్ని ముందస్తు షరతులు, టెక్నాలజీ ఆధారంగా రక్షణ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించినట్టు పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దేశ ప్రయోజనాలను, భద్రతను పక్కనపెట్టి అమెరికాకు అనుకూలంగా పనిచేస్తోందని, పార్లమెంటులో ఈ విషయాన్ని నిలదీస్తామన్నారు. బీజేపీ రెండేళ్ల సంబరాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఏ ప్రాతిపదికన సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. గత రెండేళ్లలో ఎఫ్‌డీలు క్షీణించినందుకా, ఎగుమతులు పడిపోయినందుకా, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైనందుకా..? అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతోందని, కాంగ్రెస్ లేని ఇండియా కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆనంద్ శర్మ బదులిచ్చారు.