: ఎస్.ఆర్.నగర్ లో కార్డాన్ అండ్ సెర్చ్!... 61 మంది అనుమానితుల అరెస్ట్!
హైదరాబాదులో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ (కట్టడి-తనిఖీ) సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో నేరాలకు చెక్ పెట్టేందుకు రెండేళ్ల క్రితం మొదలైన ఈ తరహా సోదాలను ఇప్పటికే పోలీసులు చాలా ప్రాంతాల్లో నిర్వహించారు. తాజాగా ఎస్.ఆర్.నగర్ (సంజీవ రెడ్డి నగర్) పరిధిలోని ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్, జయప్రకాశ్ నగర్ లలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కార్డాన్ సెర్చ్ సోదాలు జరిగాయి. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాదాపు 400 మంది పోలీసులు ఆయా ప్రాంతాలను చుట్టుముట్టారు. పెద్ద సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయా ప్రాంతాల వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలైన ఈ సోదాలు నేటి తెల్లవారుజాముదాకా కొనసాగాయి. సోదాల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన 61 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... సరైన పత్రాలు లేని 39 టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు.