: తెలంగాణాది మొండి వైఖరన్న దేవినేని... ఏపీది వితండవాదమన్న హరీశ్
కృష్ణా నది నీటి పంపకాల అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, హరీశ్ రావులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో విలేకరులతో దేవినేని మాట్లాడుతూ, కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. విభజన తాము కోరుకున్నది కాదని, రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితులు తలెత్తాయని ఆయన మండిపడ్డారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా రూ.500 కోట్ల విలువైన పంటను కాపాడుకోగలిగామని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలు చేపట్టాలని మాత్రమే తాము కోరుతున్నామని దేవినేని అన్నారు. కాగా, ఇదే విషయమై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కృష్ణానది నీటి పంపకాల అంశంలో ఏపీ వితండవాదం చేస్తోందన్నారు. నాగార్జున సాగర్ కుడికాలువను తమకే అప్పగించాలని ఏపీ కోరడం సరికాదన్నారు. ఒకే ప్రాజెక్టును రెండు రాష్ట్రాలు నిర్వహించుకోవడం దేశంలో ఎక్కడా లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించే నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరితే ఏపీ పట్టించుకోవట్లేదన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లుంటున్నాయని, తెలంగాణలో మాత్రం ఒక పంటకు కూడా నీరు ఉండకూడదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. గోదావరి నీటి లభ్యతపై స్వతంత్ర కమిటీ వేసి తెలంగాణకు అందులో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ కార్యదర్శితో జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, రేపు ఉదయం మరోసారి భేటీ కానున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.