: ఒకప్పుడు వైఎస్.. ఇప్పుడు జగన్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు: చంద్రబాబు
ఒక్కో రైతుకు లక్షన్నర రుణ విముక్తి చేయడం మామూలు విషయం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కూడా రుణాలు మాఫీ చేయలేదని, తాము లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్నామని ఆయన అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు రుణమాఫీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఒకప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. ‘నేనొక్కడినే కష్టపడితే అభివృద్ధి సాధ్యం కాదు.. అందరూ కలసి రావాలి. రైతు నేల తల్లినే నమ్ముకుంటాడు. ఎన్ని కష్టాలు పడ్డా మనకు అన్నాన్ని పెడతాడు.. అలాంటి రైతు సంక్షేమాన్ని మేము మరవబోం’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు నెలల్లో విద్యుత్ సమస్యను అధిగమించామని ఆయన అన్నారు. నదుల అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కృష్ణా, సోమశిల నదులను అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతుల కష్టాలన్నీ తీరుతాయని ఆయన అన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని భూగర్భజలాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు.