: తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం
తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమయింది. ఛార్జీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను అధికారులు కేసీఆర్‌కి వివరించారు. దీనిపై ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకోనుంది. సామాన్యులపై భారం పడకుండా ఛార్జీల పెంపు ఉండాలని సీఎం సూచించారు. పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు రూపాయి ఛార్జీ పెంపునకు ప్రతిపాదన వచ్చింది. 30 కిలోమీటర్లు దాటితే కనుక రూ.2 పెంపు వుంటుంది. ఇతర బస్సు సర్వీసుల్లో ఛార్జీల పెంపు 10 శాతానికి మించరాదని సీఎం సూచించారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా ఛార్జీల పెంపునకు సంస్థలకు అధికారం ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. గృహ అవసరాలకు 100 యూనిట్లలోపు వినియోగం ఉంటే విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని అధికారులకు ఆయన సూచించారు. 100 యూనిట్లు దాటితే స్వల్పంగా ఛార్జీలు పెంచాలని సూచించారు. పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై 7 శాతంలోపే పెంపు ఉండాలని కేసీఆర్ చెప్పారు. సింగరేణి బలోపేతానికి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని వాటిని అభివృద్ధి పరుస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.