: మా పని మేము చేశాం, ముద్రగడ అరెస్టు క్రమంలో అసభ్యంగా మాట్లాడలేదు: తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ
తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరశనకు దిగిన కాపునేత ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేసే క్రమంలో పోలీసుల ప్రవర్తన తీరు బాగోలేదంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు ముద్రగడ కూడా పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ కాకినాడలో స్పందించారు. ముద్రగడను అరెస్టు చేసే నేపథ్యంలో తాము అసభ్యంగా ప్రవర్తించలేదని ఆయన అన్నారు. కాపు వర్గీయులతో మాత్రం తమకు ఘర్షణ ఏర్పడిందని ఆయన అన్నారు. ముద్రగడ ఆరోజు చేతిలో పురుగుల మందు సీసా పట్టుకున్నారని, బలవన్మరణానికి పాల్పడతానంటే చట్టం ఒప్పుకోదని రవిప్రకాశ్ పేర్కొన్నారు. తమ పని తాము సక్రమంగా చేశామని ఆయన అన్నారు. ముద్రగడ ఇంటి తలుపులు బద్దలు కొట్టడానికి కూడా అదే కారణమని ఆయన చెప్పారు. తూర్పుగోదావరిలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.