: జార్ఖండ్ ఖాకీల దాష్టీకం!... 23 ఏళ్ల యువతిని తాళ్లతో కట్టేసి లాక్కెళ్లిన వైనం!
మానవ హక్కులను పరిరక్షించాల్సిన ఖాకీలే అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అతివ అని కూడా చూడకుండా నడుము చుట్టూ తాళ్లతో కట్టి ఓ యువతిని లాక్కెళ్లారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. నేరస్తులకు సంకెళ్లేయడం, తాళ్లతో బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఓ వైపు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నెత్తీ నోరు బాదుకుంటున్నా జార్ఖండ్ పోలీసులు ఈ దాష్టీకానికి పాల్పడటం గమనార్హం. వివరాల్లోకెళితే జార్ఖండ్ లోని గర్వాకు చెందిన ఓ మహిళకు రాజస్థాన్ పట్టణం అల్వార్ లోని బ్యాంక్ కాలనీకి చెందిన 23 ఏళ్ల అపర్ణ సోదరుడికి పెళ్లైంది. ఆ తర్వాత వరకట్న వేధింపులు ఎదురుకావడంతో అపర్ణ వదిన పుట్టింటికి వెళ్లిపోయింది. సొంతూరుకు వెళ్లిన తర్వాత ఆమె అపర్ణ కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో డౌరీ హరాస్ మెంట్ కేసు నమోదు చేసుకున్న గర్వా పోలీసులు అపర్ణను అరెస్ట్ చేసేందుకు అల్వార్ వెళ్లారు. అల్వార్ లో అపర్ణను అరెస్ట్ చేసిన జార్ఖండ్ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులకు మస్కా కొట్టిన అపర్ణ తప్పించుకుని పారిపోయింది. ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన గర్వా పోలీసులు అల్వార్ రైల్వే స్టేషన్ లో ఆమెను తిరిగి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మరోమారు తప్పించుకుపోకుండా ఉండేందుకు ఆమె నడుము చుట్టూ తాళ్లు వేసి కట్టేశారు. కొద్దిసేపు అల్వార్ రైల్వే స్టేషన్ లోనే ఆమెను కూర్చోబెట్టిన గర్వా పోలీసులు... కట్లతోనే ఆమెను జార్ఖండ్ రైలెక్కించేశారు. జీన్ ప్యాంట్, టీ షర్ట్ లో ఉన్న సదరు యువతిని తాళ్లతో కట్టేసిన పోలీసుల వైఖరికి ఆశ్చర్యపోయిన స్థానికులు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నేషనల్ మీడియా చేతికి చిక్కాయి. ఇక అపర్ణను తాళ్లతో కట్టేసిన పోలీసు బృందంలో మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉండటం గమనార్హం.