: సుబ్రహ్మణ్యస్వామిపై ముప్పేట దాడి మొదలుపెట్టిన బీజేపీ నేతలు!
ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని ఏమీ అనని ఆ పార్టీ నేతలు, ప్రధాని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ను తొలగించాలని డిమాండ్ చేసిన వేళ, ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఆర్బీఐ తదుపరి గవర్నరుగా రేసులో ఉన్న అరవింద్ పై సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు తగవని హితవు పలికారు. అది ఆయన అభిప్రాయం మాత్రమేనని, అటువంటి వ్యాఖ్యలు పార్టీలో నేతల మధ్య విభేదాలు సృష్టిస్తాయని బీజేపీ ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చెప్పాల్సింది ఇంకేమీ లేదని అన్నారు. స్వామి వార్తల్లో నిలిచేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పాలనా సంబంధ వ్యవహారాల్లో ఈ తరహా వ్యాఖ్యలు తగవని, అదికూడా సొంత పార్టీపైనే చేస్తుంటే, ప్రజల్లో చులకన అవుతామని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని బీజేపీ నేత ఒకరు విమర్శించారు. కాగా, ఈ ఉదయం స్వామి, అరవింద్ సుబ్రమణియన్ కాంగ్రెస్ వ్యక్తని, ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ, స్వామి అసలు లక్ష్యం రాజన్ లేదా అరవింద్ కాదని, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని పదవి నుంచి దింపడమేనని దుయ్యబట్టారు.