: నిన్న టీడీపీలోకి... నేడు తిరిగి సొంత గూటికి చేరుకున్న వైకాపా ఎంపీపీ, ఎంపీటీసీలు
ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి ఎంపీపీ, ఎంపీటీసీలు తిరిగి సొంత గూటికి వచ్చేశారు. ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి తమపై ఒత్తిడి చేసి తీసుకెళ్లి, టీడీపీ కండువాలు కప్పించారని వారు ఆరోపించారు. తాము వైకాపాలోనే ఉంటామని బైరెడ్డిపల్లి ఎంపీపీ విమల వ్యాఖ్యానించారు. వీరిని తిరిగి వైకాపాలోకి స్వాగతించిన పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు, ఏ అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల అభివృద్ధి కోసమా? లేక స్వీయ అభివృద్ధి కోసమా? అన్నది చెప్పాలని విమర్శించారు. వైకాపాను వీడిన ఎమ్మెల్యేలు తమ పదవులను కూడా వీడి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపాలని డిమాండ్ చేశారు.