: పాకిస్థాన్‌లో ‘ఉడ్తా పంజాబ్’కు 100 సెన్సార్ కట్స్
బాలీవుడ్ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ ఎన్నో వివాదాల నుంచి తప్పించుకొని చివరికి విడుదలకు నోచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు పాకిస్థాన్‌లో విడుదలవడానికి కష్టాలు ఎదుర్కుంటోంది. భారతీయ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు మొదట 89 కట్స్ చేయాలని సూచించింది. అయితే, చివరకు బాంబే హైకోర్టు జోక్యంతో ఈ సినిమా ‘ఏ’ సర్టిఫికెట్ తో సింగిల్ కట్ తోనే విడుదలైంది. అయితే, పాకిస్థాన్‌లో ‘ఉడ్తా పంజాబ్’ సినిమా విడుదల చేయాలంటే అక్కడి సెన్సార్ బోర్డు 100 కట్స్ పడాల్సిందేనని స్పష్టం చేసింది. పంజాబ్ డ్రగ్ మాఫియా ప్రధాన ఇతివృత్తంగా ‘ఉడ్తా పంజాబ్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ అంశమే ఈ సినిమా భారత్‌లో వివాదాస్పదమయింది. అయితే, పాకిస్థాన్‌లో మాత్రం ఆ దేశానికి, ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న సీన్లు, డైలాగ్‌లు అడ్డంగా మారాయట. వీటిని తొలగించాలని పాక్ సెన్సార్ బోర్డు సూచించింది. లేదంటే వారి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డైలాగులు వినపడకుండా బీప్ శబ్దాలతో నింపాలని ఆదేశించింది. వాటిని తొలగించిన తరువాత పాక్ సెన్సార్ బోర్డు మరోసారి సినిమాను పరిశీలించనుంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను అక్కడ విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్‌లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.