: దీక్ష విరమించిన ముద్రగడ.. ఊపిరి ఉన్నంత వరకు కాపుల కోసం పోరాడతానని వ్యాఖ్య
తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొన్ని రోజులుగా కొనసాగిస్తోన్న నిరాహార దీక్షను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో విరమించారు. 14రోజులుగా ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగించిన ముద్రగడకు కాపు సంఘాల నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. ‘ఊపిరి ఉన్నంత వరకు నా జాతి కోసం పోరాడతా’నని అన్నారు. ‘ఎన్ని అవమానాలయినా భరిస్తాను.. ఇచ్చిన హామీని నెరవేర్చండి. హమీలను అమలు చేస్తున్నారన్న చల్లని కబురు వచ్చే వరకు నేను ఏ పండుగ చేసుకోను’ అని ఆయన వ్యాఖ్యానించారు.