: ఒలింపిక్స్ కు ఆకర్షణగా చిరుతను తెచ్చి, కాల్చి చంపేసిన అధికారులు; మండిపడుతున్న ప్రపంచం
ఒలింపిక్స్ సన్నాహకాలను ఘనంగా నిర్వహిస్తున్న బ్రెజిల్ లో టార్చ్ వేడుకలు జరుగుతున్న వేళ, ఆకర్షణీయత కోసం తెచ్చిన చిరుతపులిని కాల్చి చంపాల్సి వచ్చింది. ఈ ఘటనపై ప్రపంచ జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే, ఒలింపిక్స్ పోటీలకు అధికారిక మస్కట్ గా పసుపు పచ్చ చిరుతను గుర్తించి, మస్కట్ కు 'జింగా' అని పేరు పెట్టారు. ఇక ఒలింపిక్ టార్చ్ ఈవెంట్ జరుగుతున్న వేళ, జింగా కూడా ఉండాలన్న ఉద్దేశంతో, మనౌస్ మిటలరీ కాంపౌండుకు ఆనుకుని ఉన్న జూ నుంచి ఓ చిరుతపులిని తెచ్చారు. కార్యక్రమం వైభవంగా సాగుతున్న వేళ, సంరక్షకుల చేతుల్లోంచి చిరుత తప్పించుకుంది. ఆ వెంటనే ఓ సైనికుడు దాన్ని కాల్చి చంపాడు. తొలుత చిరుతకు మత్తు మందు ఇచ్చామని, ఆపై అది మత్తులోకి వెళ్లపోవడంతో, భారీ ఎత్తున ఉన్న ప్రజలకు ఆపద కలగరాదన్న ఉద్దేశంతో దాన్ని చంపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. రియో 2016లో ఇకపై ఇటువంటి ఘటనలు జరగనీయబోమని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కనిపిస్తోందని, చిరుతను కాల్చినట్టుగా వారినీ కాల్చాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఒలింపిక్స్ పోటీలను వైభవంగా నిర్వహించాలని భావిస్తుంటే, అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం, దేశం పరువును తీసిందని బ్రెజిల్ వాసులు మండిపడుతున్నారు.