: ‘పూర్’ ఉద్యోగులపై చైనా రూరల్ బ్యాంక్ బెత్తం శిక్ష!... వీడియో వైరల్
పనితీరులో ఆ 8 మంది ఉద్యోగులంతా ‘పూర్’గా ఉన్నారట. నిర్దేశించిన మేర ఫలితాలను రాబట్టలేకపోయారట. అంతే... వారంతా పనిచేస్తున్న సంస్థ వారిని వరుసగా నిలబెట్టి బెత్తానికి పని చెప్పింది. సహచర ఉద్యోగులు విందారగిస్తుండగా, వేదికపై వరుసగా నిలబడ్డ వారిపై బెత్తంతో సంస్థ అధికారి విరుచుచుకుపడ్డాడు. వరుసలోని ఓ చివర నుంచి మొదలు పెట్టి ఈ చివర దాకా దెబ్బలేస్తూ ఆ అధికారి అలా నాలుగు రౌండ్ల శిక్ష వేశాడు. మూడు దెబ్బల దాకా కదలకుండానే నిలబడ్డ ఉద్యోగులు నాలుగో దెబ్బకు మాత్రం బాధతో మెలిక లు తిరిగిపోయారు. చైనాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వివరాల్లోకెళితే... చైనాలోని ఓ రూరల్ బ్యాంకు తన సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ పని చేయిస్తోంది. ఆ బ్యాంకుకు చెందిన ఓ శాఖలో పనిచేస్తున్న 8 మంది సిబ్బంది (నలుగురు మహిళలు, నలుగురు పురుషులు) నిర్దేశిత టార్గెట్లను చేరుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆ శాఖ సిబ్బందికి ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ సమావేశంలో భాగంగా డిన్నర్ ఏర్పాటైంది. ఈ డిన్నర్ కు శాఖ సిబ్బంది అంతా హాజరయ్యారు. విందారగించేందుకు టేబుళ్ల ముందు కూర్చున్నారు. అయితే ‘పూర్’ ప్రదర్శన కనబరచిన ఆ 8 మందిని మాత్రం బ్యాంకు మేనేజర్ వేదికపై వరుసగా నిలబెట్టాడు. వారి పనితీరు బాగోలేదని వారితోనే మైకులో చెప్పించారు. ఆ తర్వాత తొలుత వరుసలో పురుషులు నిలబడ్డ వైపు నుంచి మొదలుపెట్టి ఆ మేనేజర్... వరుసగా వారిపై బెత్తం దెబ్బలేస్తూ మహిళలు ఉన్న చివరి వరకు చేరారు. ఆ వెంటనే మళ్లీ మహిళల వైపు నుంచి రివర్స్ గా బెబ్బలేస్తూ ముందుకు సాగారు. ఇలా మూడో రౌండ్ దెబ్బల దాకా బాధితులు కదలకుండానే నిలబడ్డారు. నాలుగో దెబ్బ పడగానే మహిళల వైపు వరుస చివరలో నిలబడ్డ ఓ యువతి బెత్తం దెబ్బలకు తాళలేక మెలికలు తిరిగిపోయింది. ఉద్యోగులపై బెత్తంతో ప్రతాపం చూపిన వ్యక్తి బ్యాంకు మేనేజర్ కాదని, ఆ సంస్థ నియమించుకున్న కార్పొరేట్ ట్రైయినర్ అని స్థానిక అధికారులు ఆ తర్వాత నిర్ధారించారు.