: ప్రపంచంలోనే అతి ఎత్తయిన యుద్ధభూమిపై భారత సైనికుల యోగా
సరిహద్దుల వద్ద డేగ కన్నులతో పహారా కాసే భారత సైనికులు మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన యుద్దభూమిగా పేరుగాంచిన సియాచిన్ గ్లేసియర్ లో యోగాసనాలు వేసి అబ్బురపరిచారు. 20వేల అడుగుల ఎత్తున జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం పలు యోగాసనాలు వేసి యోగాపై తమకున్న మక్కువను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సైనికులు, అధికారులు పాల్గొని వివిధ యోగాసనాలు ప్రదర్శించినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సియాచిన్ తోపాటు లేహ్, కార్గిల్ సహా ఎల్ఓసీ పొడవునా ఉన్న ఇతర ఆర్మీ క్యాంపుల్లోనూ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. లేహ్ లో నిర్వహించిన కార్యక్రమంలో 900 మంది సైనికులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. యోగాపై సైనికుల్లో అవగాహన పెంచడంతోపాటు దానివల్ల కలిగే లాభాలను సైనికులకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.