: మంత్రుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం!... అంతా ఉండి ఏం చేస్తున్నారని నిలదీత!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బదిలీల్లో జాప్యం, వివాదాలను ప్రస్తావించిన సందర్భంగా నిన్న ఆయన విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఫైరయ్యారు. అంతా ఉండి ఏం చేస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేయడంతో మంత్రులు తెల్ల మొహాలేశారు. బదిలీల గురించి పట్టించుకునే తీరికే లేదా?, కనీసం ఈ విషయంపై గంట సమయం కూడా కేటాయించలేరా? అంటూ ఆయన మంత్రులను నిలదీశారు. అయినా పాలన చేపట్టి రెండేళ్లు పూర్తైనా పనితీరులో తన లైన్ ను అందుకోలేకపోతున్నారని ఆయన ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. బదిలీలకు సంబంధించి మంత్రులకే కౌన్సిలింగ్ పెట్టాలేమోనని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల కలెక్టర్లతో ఇంకా విభేదాలు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.