: పవన్ కల్యాణ్ గారూ, కులానికి ప్రమాదం జరుగుతున్నా స్పందించరేం?: అంబటి రాంబాబు
ప్రస్తుత తరుణంలో పవన్ కల్యాణ్ మాట్లాడకపోవడమనేది సమాజంలో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఒక టీవీ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, కాపు సమాజం గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసేందుకు గట్టిగా కృషి చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, పవన్ వల్లనే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారని అన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బయటకు కనపడనీయకుండా చంద్రబాబు సర్కార్ చేస్తోందని, అసలు ముద్రగడ ఎలా ఉన్నారనే సందేహం యావత్తు సమాజానికి వస్తోందని, అదే సమయంలో పవన్ కల్యాణ్ నోరువిప్పకపోవడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, దీనిని తాను కూడా సపోర్ట్ చేస్తున్నానని అన్నారు. ‘అరుదుగా మాత్రం ప్రజల్లోకి వచ్చి మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కల్యాణ్, ఒక కులాన్ని సపోర్ట్ చేస్తే కులముద్ర పడిపోతుందని ఆయనేమన్నా అనుకుంటున్నారేమోనని నాకు అనుమానం. పవన్ కల్యాణ్ గారు, మీ కులానికి ప్రమాదం వచ్చినప్పుడైనా మీరు మాట్లాడకుండా ఉంటే తప్పవుతుందని నా ఉద్దేశ్యం. బహుశ తర్వాతైనా ఆయన మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. ఏది ఏమైనా, సమాజంలో తన కులానికి, తన కుటుంబానికి, తన వర్గానికి, తన రాష్ట్రానికి ప్రమాదం వచ్చినప్పుడు స్పందించకపోతే తప్పవుతుందనే విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ గారు గమనించాలని, ఆయన స్పందించాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య బద్ధంగా జరగవలసిన ఒక నిరాహార దీక్షను నిరంకుశంగా, కర్కశంగా అణచివేయడానికి చంద్రబాబునాయుడు గారి పోలీసు బలగాలు ప్రవర్తిస్తున్న తీరును ఖండించాల్సిన ఆవశ్యకత మాత్రం పవన్ కల్యాణ్ గారిపై మరింత ఎక్కువగా ఉంది’ అని అంబటి రాంబాబు అన్నారు.