: రేపటి గురించి బాధపడకుండా నేడు చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారులే మాకు స్ఫూర్తి: హీరో సాయి ధరమ్ తేజ్
ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధితో పోరాడుతూ... రేపటి గురించి బాధపడకుండా నేడు చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారుల చిరునవ్వులే తమకు స్ఫూర్తి అని యువ హీరో సాయి ధరమ్ తేజ్ అన్నాడు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో యోగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిధరమ్ తేజ్, హీరోయిన్ ఫరాకరీం హాజరయ్యారు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో సరదాగా కాసేపు వారు గడిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. క్యాన్సర్ బారి నుంచి వారు త్వరగా కోలుకోవాలని సాయిధరమ్ తేజ్, ఫరాకరీం కోరుకున్నారు. కాగా, ఇందుకు సంబంధించి సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. దీంతోపాటు, ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశారు.